భారతదేశ జిల్లాల జాబితా

జిల్లాలోని భాగాలు. గోవా ఒక రాష్ట్రము. రాష్ట్రము కొన్ని జిల్లాలుగా విభజించబడింది. ప్రతీ జిల్లా మరలా అనేక తాలూకాలుగా విభజించబడినది

జిల్లా అనేది భారతదేశంలోని రాష్ట్రాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భాగము. భారతదేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైనదే, కానీ ఈ పదవికి అధికారాలు ఏమీ ఉండవు. కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి. అలా కాకుండా కేంద్రప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ మరియు పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.

ప్రతీ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతీ జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్. ఆఫీసరును కలక్టరుగా నియమిస్తుంది. ఈ అధికారి జిల్లాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటారు. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు. పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబాయి లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.

జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది. జిల్లాలను కూడా తాలూకాలు లేదా తెహసిల్లు, మండలాలుగా విభజిస్తారు. వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.

విషయ సూచిక